ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే అతను చనిపోయాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ధర్నా నిర్వహించారు.
టీఆర్‌ఎస్ నేతల ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు బీజేపీ కార్యకర్తలు. అదే సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరస్పర దాడులు చేసుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల వేధింపులే సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమని మండిపడ్డారు.
పార్టీలో చురుగ్గా పని చేస్తున్నాడని.. ఎలాగైనా అతని స్పీడ్ ను ఆపాలని కుట్ర పన్నిన కొందరు టీఆర్ఎస్ నేతల అండతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడంతోనే సాయి గణేష్ చనిపోయాడని అంటున్నారు బీజేపీ నేతలు. అతనిపై 16 కేసులు ఉన్నాయని చెబుతున్నారు.
Advertisements
సాయి గణేష్ మరణానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఖమ్మంలో ధర్నా చేశారు బీజేపీ నేతలు. స్థానిక మంత్రి ఒత్తిడితోనే గణేష్ పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అయితే.. పోలీసులు వారి ధర్నాను అడ్డుకున్నారు. దీంతో ఓ కార్యకర్త కరెంట్ వైర్ పట్టుకుని చనిపోయేందుకు ప్రయత్నించాడు. అతడితోపాటు అందర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు.