వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ పై ఎలుకల దాడి ఘటనకు బాధ్యులుగా ఇద్దరు డాక్టర్లపై వేటు వేసింది ప్రభుత్వం. అందుకు నిరసన డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలుకల బోన్లు, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. డాక్టర్లపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాము ప్రభుత్వ వైద్యులమని గుర్తించాలని విరుచుకుపడ్డారు. రోగులకు వైద్య చికిత్స చేయడానికి మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నామని.. ఎలుకల పట్టడానికి డాక్టర్ చదువుకోలేదని మండిపడ్డారు. తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుంటే.. రోగులకు చికిత్స చేయడంలో, తమ విధులు నిర్వహించడంలో ఏమైనా నిర్లక్ష్యం ఉంటే.. లేదా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం జరిగితే తమ పైన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఆసుపత్రిలో సరైన సదుపాయాలు సమకూర్చకుండా.. ప్రభుత్వం చేసిన తప్పులకు డాక్టర్లను శిక్షించడం ప్రభుత్వానికి న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో ఎలుకలు వస్తున్నాయని చెప్పగానే ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వయంగా పరిశీలించి.. చెత్త, సామాన్లు తీసేయించారని.. తర్వాత కూడా కాంట్రాక్టర్ కు కేవలం నెల రోజుల్లోనే రెండుసార్లు నోటీసులివ్వడం జరిగిందన్నారు.
ఇంత జరిగిన తర్వాత కూడా ఎలుక వచ్చి పేషెంట్ ను కొరికితే.. అది కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ లేదా.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అవుతుందే కానీ.. డాక్టర్ల తప్పు కాదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందజేయాలి గాని.. ఏదో ఉద్దేశాలతో అడిషనల్ డీఎంఈ క్యాడర్ లో ఉన్న సూపరిండెంట్ ని షోకాజ్ లేకుండా.. మెమో ఇవ్వకుండా.. కనీసం వివరణ అడగకుండా డీఎంఈకి సరెండర్ చేయడం చాలా అన్యాయం అన్నారు.