పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జీవో నెం.317 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బాధితుల సంఘం పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బిర్లా మందిర్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీలో భాగంగా ఉపాధ్యాయులు, సీఎం కేసీఆర్ ఫేస్ మాస్క్ ను ధరించి నిరసన తెలిపారు. జీవో నెం 317 వల్ల స్థానికతను కోల్పోయామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు.
ఈ క్రమంలో ఆందోళన చేస్తోన్న టీచర్ల దగ్గర్నుంచి ఫేస్ మాస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని నాలుగు రోజుల క్రితం మినిస్టర్ క్వార్టర్స్ లో స్పౌజ్ టీచర్లు మంత్రులను కలిశారు. మంత్రులు గుంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పౌజ్ బదిలీలను చేపట్టకపోవడం వల్ల టీచర్లుగా తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో 317 లో భాగంగా తమను కేటాయించారని… దీంతో నిత్యం వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసి వెళ్లాల్సి రావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలను కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు వాళ్లు.
అలాగే.. భార్యభర్తలు ఇద్దరూ ఒకే జిల్లాలో పనిచేసే విధంగా స్పౌజ్ బదిలీలు తక్షణమే చేయాలని టీచర్లు కోరారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాల్లో 615 స్పౌజ్ బదిలీలను చేసింది. ఇక మిగిలిన 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను నిలిపివేయడంతో.. అక్కడ కూడా వెంటనే బదిలీలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.