కరోనా మృతుని అంత్యక్రియలపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. తమ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తే వైరస్ అందరికీ వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించకుండా పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి సోమవారం రాత్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జరిగింది.
దేశంలో ఎనిమిదో కరోనా మృతుడు సోమవారం కోల్ కతాలో చనిపోయాడు. రాత్రి అంత్యక్రియలు నిర్వహించడానికి పోలీసులు స్మశానికి తీసుకురాగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతుడు ఇటలీకి వెళ్లి వచ్చాడని పుకార్లు వ్యాపింప చేశారు.
మృతుని కుమారుడు(27) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మృతుని భార్య, కోడలు ఇతర కుటుంబసభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు. అంతర్జాతీయ విమానాలన్నీ రద్దవ్వడంతో తాను వచ్చే పరిస్థితి లేదని..తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని మృతుని కుమారుడు ప్రభుత్వానికి లేఖ రాశాడు. నిబంధనలు అనుమతిస్తే తమ కుటుంబానికి చితాభస్మాన్ని అందించాలని లేఖలో అభ్యర్ధించాడు.
మృతుని బావమర్ది కోల్ కతాలోని అతని ఇంటికి రాగా..ఇరుగుపొరుగు వాళ్లు అతన్ని అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో వేసి తాళం వేశారు. అతనికి కూడా వైరస్ ఉందని అనుమానించారు. ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి విడిపించారు.
మృతుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. అతను డమ్ డమ్ విమానాశ్రయం సమీపంలో నివసిస్తుంటాడు. బహుశా ట్రెయిన్ జర్నీతో అతనికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 16 న హాస్పిటల్లో చేరిన అతను చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు.
ఇదిలా వుండగా అతని కుమారుడు అమెరికా నుంచి వచ్చాడని…తండ్రికి వైరస్ సోకడంతో అతను కోల్ కతాలోనే ఎక్కడో దాక్కున్నాడనే పుకార్లు వ్యాపించాయి. నిజానికి మృతుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి అకౌంటెంట్. ఫిబ్రవరి 28 న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భార్యతో కలిసి కోల్ కతా నుంచి ఆజాద్ హింద్ ఎక్స్ ప్రెస్ లో బిలాస్ పూర్ వెళ్లారు. మార్చి 2 వ తేదీన తిరిగొచ్చారు. మార్చి 13న అనారోగ్యంతో స్థానిక డాక్టర్ ను సంప్రదించాడు. మార్చి 16 న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మార్చి 21 న కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. మార్చి 23 న చనిపోయాడు. పశ్చిమ బెంగాల్ లో ఇతను నాలుగో కరోనా పేషెంట్. మొదటి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కేసు. ఇతని కంటే ముందు గుర్తించిన ముగ్గురు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే.