ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నిరసన సెగ తగిలింది. స్థానికంగా ఉన్న సమస్యలపై నారాయణ స్వామిని గ్రామస్థులు గట్టిగా నిలదీశారు. శనివారం నారాయణ స్వామి చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలం గురవరాజు గుంటలోని గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎంకు నిరసన సెగ తగిలింది.
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ప్రజలకు ఏమిచేశావు? అంటూ స్థానిక యువకులు నిలదీసే ప్రయత్నంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, నారాయణ స్వామి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో బస్టాండ్, సెల్ టవర్, నిర్మించలేదని వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా ఏ నాయకుడు పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి సమస్యల గురించి ప్రశ్నించితే.. మీరు టీడీపీ కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ఎవరో తెలియదన్నందుకు ఓ మహిళపై గౌరవం లేకుండా హేయ్ అని అవహేళనగా మాట్లాడారు ఎంపీపీ భర్త.
సాక్షి పేపర్ చూపిస్తూ మెగా డీఎస్సీ అన్నారని.. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి గారు ఒక డీఎస్సీ కూడా పెట్టలేదని డిప్యూటీ సీఎంను నిలదీశారు నిరుద్యోగులు. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు ఒక డీఎస్సీ కూడా పెట్టలేదని, జాబ్ కేలండర్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.