అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు తోపుడు బండ్లపై మోటార్ సైకిళ్లు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన తెలిపాయి.
ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు నిరసన కారులు. దీంతో తమ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదంటూ ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి.. స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, నగర అధ్యక్షురాలు కవిత మహేశ్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జ్ఞానోదయం చేయాలని.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.