కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆకలిచావులు మిగిలాయని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ లు లేక విద్యార్ధులు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతుంటే.. కేటీఆర్ కు అయ్య బర్త్ డే వేడుకలు కావల్సి వచ్చిందా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలో కేసీఆర్ చిత్రపటాన్ని గాడిదకు వేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టీఆర్ఎస్ పాలన.. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులు,రైతుల పాలిట శాపంగా మారిందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఆకలి చావులు చస్తుంటే.. సీఎంకు ఉత్సవాలు కావల్సి వచ్చిందా అని నిలదీశారు.
కేసీఆర్ అసమర్ధ పాలనలో అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. ఏ మాత్రం పట్టనట్టుగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. అందుకే.. తాము గాడిదకు బర్త్ డే వేడుకలు నిర్వహించి.. సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.
అయితే.. శుక్రవారం కేసీఆర్ పుట్టినరోజును విమోచన దినంగా జరుపుకోవాలని.. గాడిదలకు బర్త్ డే వేడుకలు జరపాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు గాడిదకు పుట్టినరోజు జరుపుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.