ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబాయ పరారయ్యాక పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కనిపించినా దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా అధ్యక్షుడి భవనంలో నిరసనకారుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో ఈతకొట్టి జాతీయ జెండాలను రెపరెపలాడించారు. అంతేకాదు కిచెన్ లోకి వెళ్లి వంటకాలు చేసుకుని మరీ ఆరగించారు. అన్నీ చెల్లాచెదురుగా పడేశారు. అంతటితో ఆగకుండా భవనంలోని జిమ్ లో వర్కవుట్స్ చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు.
గత కొద్దిరోజులుగా శ్రీలంక.. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక మాంద్యం కారణంగా నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడటంతో అధ్యక్షుడు, ప్రధానిపై ఒత్తిడి పెరిగింది. ప్రజలు ఆహారం, ఇంధనం, ఇతర అవసరాలను కొనుగోలు చేయడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడు పరారవ్వడం, ప్రధాని రాజీనామా చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటు నిరసనల మధ్య దాడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రధాని ఇంటికి నిప్పుపెట్టగా.. శ్రీలంక ఎంపీ రజిత సేనరత్నపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. సేనారత్నను చుట్టుముట్టిన నిరసనకారులు పిడుగుద్దుల వర్షం కురిపించారు.