కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలో భాగంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైతుల నుంచి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు ముందే చెప్పామని.. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. పంజాబ్ తరహాలో రాష్ట్ర రైతులు పండించిన వరిని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి సబిత పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను కేంద్రమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం వరి కొనేంత వరకు విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై వందలాది మంది రైతులతో కలిసి భారీగా ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేక విధానాలు వీడి అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి కోరారు.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైరా, ఏనుకూరు, కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో నాయకులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దీక్షలో కూర్చున్నారు.
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కేంద్రం ధాన్యం కొనేంతవరకు రైతులు, పార్టీలకు అతీతంగా నిరసనలు చేయాలనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజా కొనేంతవరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.