రాజ్యాంగాన్ని మార్చేయాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షపార్టీలు, దళిత బహుజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు నేతలు. కేసీఆర్ దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్. రాజ్యాంగాన్ని మార్చాలని అనుకునే ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ విద్యార్థులు రగిలిపోతున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి న్యాయ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర కేసీఆర్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దహనం చేసి నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గాంధీ భవన్ నుంచి అమరవీరుల స్థూపం వరకు కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. అయితే తెలంగాణ పోలీసులు వారిని అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాగరిగారి ప్రీతం మాట్లాడుతూ.. బిడ్డా కేసీఆర్.. తక్షణమే నీ మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళిత కాంగ్రెస్ పక్షాన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారంటూ.. కేసీఆర్ నిరంకుశ వైఖరికి నిరసనగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దళిత బహుజన సంఘాలు నిరసన తెలిపాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశాయి. కేసీఆర్ మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలా చేయకపోతే కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించాయి.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లాలోనూ నిరసనలు కొనసాగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ లో కేసీఆర్ పై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంద మల్లికార్జున్ సీఎంపై మండిపడ్డారు.
కేసీఆర్ కు మతి భ్రమించిందని.. మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటస్వామి విమర్శించారు. అలాగే తంగాళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ లీడర్లు.
కొడంగల్ లోనూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కొనసాగింది. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని సిరిసిల్లలో కూడా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.