కెనడాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యాక్సినేషన్ ని తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం చేసిన ప్రకటనని ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. వందలాది వాహనాలు, ట్రక్కులతో ఆందోళనకారులు రాజధాని నగరం ఒట్టావాను ముట్టడించారు.
పరిస్థితులు చేయి దాటడంతో ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సహా ఆయన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు.’ఫ్రీడమ్ కాన్వాయ్’ పేరుతో ఆందోళనలకు దిగారు. టీకా తప్పనిసరి నిబంధనను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొంటున్నారు. కొంతమంది నిరసనకారులు చిన్నారులను సైతం వెంటతెచ్చుకున్నారు. ప్రధానికి తీవ్రపదజాలం వాడుతూ దూషిస్తూ.. నినాదాలు చేశారు. నిరసన కారులు వినూత్న పద్దతిలో నిరసనలు తెలుపుతున్నారు.
జాతీయ యుద్ధస్మారకం వద్ద కొందరు డ్యాన్సులు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కరోనా ఆంక్షల నుంచి స్వేచ్ఛ కావాలంటూ నినదించారు. కోవిడ్ ప్రొటోకాల్స్, మాస్కుల ధారణ, లాక్‌డౌన్ల నుంచి తమకు విముక్తి కల్పించాలంనే బ్యానర్లను ప్రదర్శించారు.
ఒట్టావాను ముట్టడించిన ఆందోళనకారులు అక్కడి వార్ మెమెరియల్ వద్ద బైఠాయించారు. దీంతో భద్రత సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం, అధికారిక నివాసం సహా ప్రభుత్వ భవనాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ఆందోళనకారులను నియంత్రించడానికి కొన్ని చోట్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది.