ఏపీలో మద్యం అమ్మకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ.. అమాయకుల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మద్యం అమ్మకాలపై టీడీపీ నిరసనలు చేపట్టింది.
సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి నిరసన తెలిపారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఏపీలో ప్రజలు కరోనా కంటే ఎక్కువగా కల్తీసారాతోనే చనిపోతున్నారని వ్యాఖ్యానించారు.
మద్య నిషేధంపై ఇచ్చిన హామీ ఏమైందని జగన్ ను ప్రశ్నించారు లోకేష్. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందంటూ విమర్శించారు. దాని వల్ల వందలాది మంది చనిపోతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణ జరపాలని కోరారు. ఏపీలో ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వంలో మార్పు లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు లోకేష్.