వివాదస్పదమైన పౌరసత్వం (సవరణ) బిల్లుపై రాజ్య సభలో ఓ వైపు తీవ్ర చర్చ జరుగుతుండగా…ఈశాన్య రాష్ట్రాల్లో బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అస్సాం, త్రిపురలో నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో సైన్యం మోహరించింది. నిరసనకారులు రోడ్ల మీదకొచ్చి పోలీసులు, భద్రతా దళాలతో వాగ్విదానికి దిగుతున్నారు, రాళ్లు రువ్వుతుండడంతో రాజధాని గువహటిలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. నిరసనలతో ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ గంటల పాటు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.
పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన ముస్లింయేతరులైన హిందూ, సిక్కు, బౌద్ద, జైన, పార్శీ, క్రైస్తవులకు దేశ పౌరసత్వం కల్పిస్తూ పౌరసత్వం (సవరణ) బిల్లును రూపొందించారు. ఈ బిల్లుపై రాజకీయనేతలు, సామాజిక, హక్కుల కార్యకర్తలు, బీజేపీ తో పొత్తు పెట్టుకున్న కొన్ని పార్టీలు కూడా నిరసన తెలుపుతున్నాయి. శరణార్ధులకు పౌరసత్వం కల్పించడం వల్ల స్వదేశీయులు ప్రమాదంలో పడతారని…వారి ఉనికి, జీవనాధారం కోల్పోతారని అంటున్నారు. పౌరసత్వం బిల్లులో అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం లోని గిరిజన ప్రాంతాలను మినహాయించారు. అయినప్పటికీ ఈశాన్యంలోని నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన నేపధ్యంలో త్రిపురలో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్, ఎస్.ఎం.ఎస్ సేవలను నిలిపివేసింది. నిరసనకారులు రోడ్లను బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. రెండు నెలల పాపను హాస్పిటల్ తీసుకెళ్తుండగా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని చనిపోయింది.