హిందువులు కూడా తమ ముస్లింల మాదిరే, తమ ఫార్ములా ప్రకారం యుక్తవయస్సులో పెళ్లిళ్లు చేసుకోవాలంటూ అస్సాం ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. తమ ముస్లింలలో యువకులు 20-22 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి, అమ్మాయిలు 18 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి వివాహాలు చేసుకుంటారని, హిందువులు కూడా ఈ పద్దతిని అనుసరించాలని ఆయన ఓ సలహా ఇచ్చారు. పైగా హిందువులు తమ పెళ్ళికి ముందే ఇద్దరు ముగ్గురు మహిళలను చట్టవిరుద్ధంగా వివాహం చేసుకుంటారన్నారు. హిందువుల్లో చాలామంది 40 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు కూడా పెళ్లిళ్లు చేసుకోరని, అందుకే వారికీ పిల్లలు పుట్టరని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ముస్లిం జనాభా ఎందుకు పెరిగిపోతోందన్న ప్రశ్నకు ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై అస్సాం తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ గౌహతిలోని జయానగర్ లో ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. బద్రుద్దీన్ బీజేపీ ఏజంట్ అని, హిందువులను అవమానించినందుకు ఆయనను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితో బాటు అస్సాం తృణమూల్ యూత్ కాంగ్రెస్, అస్సాం తృణమూల్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనకు వ్యతిరేక నినాదాలు చేశారు. మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఆయనను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బద్రుద్దీన్ కేవలం హిందీలో మాట్లాడినందున ఆయన వైఖరి రాజకీయ దురుద్దేశాలతో కూడుకుని ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
అస్సాం సీఎం హిమంత బిస్వశర్మను కూడా బద్రుద్దీన్ అపహాస్యం చేశారు. ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య ఉదంతంపై స్పందించిన శర్మ. ఇది లవ్ జిహాద్ కేసు తప్ప మరేమీ కాదని వ్యాఖ్యానించారు. దీనిపై బద్రుద్దీన్.. ఈ దేశ టాప్ ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరని, మీరు కూడా నాలుగైదు లవ్ జిహాద్ ఉదంతాలకు పూనుకోవచ్చునని, తమ ముస్లిం అమ్మాయిలను తీసుకువెళ్ళవచ్చునని, ఇందుకు తాము అభ్యంతరం చెప్పబోమని సెటైర్ వేశారు.
బీజేపీ ఎమ్మెల్యే దిగంత కలిత దీనిపై తీవ్రంగా స్పందించి.. ఇలా మాట్లాడేముందు. . మీ తల్లిని, సోదరిని లేదా మీ ఇంటిలోని మహిళలను గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. వారి గౌరవాన్ని తగ్గించరాదన్నారు. అసెంబ్లీలో విపక్ష నేత దేబబ్రత, కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ వంటివారు కూడా బద్రుద్దీన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.