కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కు విమాన ప్రయాణంలో ఓ చేదు ఘటన ఎదురైంది. యూత్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కార్యకర్తలు విజయన్ కు వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నారు. అదే విమానంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నల్ల చొక్కాలు ధరించి మరి ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆయనకు దగ్గరగా వెళ్లబోయారు. వెంటనే అప్రమత్తమైన ఎల్‌డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ వారిని వెనక్కి నెట్టేశారు.
నినాదాలు చేస్తున్నప్పుడు కార్యకర్తలను తోసేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరసనలు చేపట్టిన వారు యూత్ కాంగ్రెస్ మట్టన్నుర్ బ్లాక్ అధ్యక్షుడు ఫర్సిన్ మజీద్, కన్నూర్ జిల్లా సెక్రటరీ ఆర్ కే నవీన్ కుమార్ ను కన్నూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరు వైద్యం కోసం తిరువనంతపురం వెళ్తున్నట్లు తెలపగా పోలీసులు వారికి అనుమతినిచ్చారు.
ఈ ఘటనపై స్పందించిన యూత్ కాంగ్రెస్ వారిద్దరూ కూడా విమానంలో శాంతియుతంగానే నిరసన చేపట్టారని, కానీ ఈపీ జయరాజన్ వారి పట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారని ఆరోపించింది. కొద్ది రోజుల క్రితం బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పై నిందితురాలు స్వప్న సురేశ్ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాయి విపక్ష పార్టీలు.