ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. ఓ మహిళపై నమోదైన దోపిడీ కేసును కొట్టి వేసేందుకు హైకోర్టు ఒక షరతు విధించింది. కేసును కొట్టి వేసేందుకు గాను ఢిల్లీలోని బాలికల పాఠశాలకు రెండు నెలల పాటు శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో ఫిర్యాదు దారుని తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కూడా ఓ షరతును విధించింది. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ (డీహెచ్‌సీఎల్ఎస్‌సీ) కార్యాలయానికి నివేదించాలని సదరు న్యాయవాదిని ఆదేశించింది. సామర్థ్యం మేరకు ప్రజా ప్రయోజనాల కోసం మూడు నెలల పాటు ఉచిత న్యాయ సేవలు అందించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో నిందితులు, ఫిర్యాదుదారు మధ్యం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు కేసును కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దానిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ జస్మీత్ సింగ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
నిందితురాలికి, ఫిర్యాదుదారునికి మధ్య సెటిల్‌మెంట్ కుదిరిందని, అలాంటప్పుడు ఈ కేసును విచారించడం సమర్థనీయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇరు పక్షాల వల్ల పోలీసుల, న్యాయవ్యవస్థల విలువైన సమయం చాలా వరకు వృథా అయిందని కోర్టు పేర్కొంది.
అందువల్ల ఇరు పక్షాలు ఏదో ఒక సామాజికంగా ఓ మంచి చేయాలని కోర్టు నిర్ణయించిందన్నారు. అందువల్ల సదరు మహిళ డిల్లీలోని బాలికల పాఠశాలలో 6 నుండి 12వ తరగతి బాలికలకు రెండు నెలల పాటు ఉచిత శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేయాలనే షరతుపై మహిళపై నమోదు చేసిన కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
మరోవైపు ఆ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కూడా ఆయన తన సామర్థ్యం మేరకు మూడు నెలల పాటు పేదలకు ఉచిత న్యాయసేవలు అందించాలని కోర్టు ఆదేశించింది. ఇది ఇలా ఉంటే నిందితురాలు తన వద్దకు న్యాయ సహాయం కోసం వచ్చిందని ఫిర్యాదు దారు(న్యాయవాది) పిటిషన్ లో తెలిపారు.
ఆ మహిళకు తాను న్యాయసహాయం చేశానని, కానీ ఆ తర్వాత ఆమె ఫీజు చెల్లించకుండా తనను బెదిరింపులకు గురి చేసిందని సదరు న్యాయవాది పిటిషన్ వేశారు. ఆ మహిళ కూడా న్యాయవాదిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇద్దరు రాజీ పడటంతో కేసును కొట్టి వేయాలని కోర్టును కోరారు.