– ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
– జేసీబీతో దర్జాగా ఇసుక అక్రమ రవాణా
– చోద్యం చూస్తున్న రెవిన్యూ, పోలీస్,మైనింగ్ అధికారులు
– ఇసుక మాఫియాపై కేసులు నమోదు చెయ్యాలి
– సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
అధికారముంటే చాలు ఎంతటి కుంభకోణాలు అయినా చేయొచ్చు అనుకుంటారు కావచ్చు కొందరు అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు అదే తరహాలో మహబూబ్ నగర్ జిల్లా, ముసాపేట్ మండలంలోని కొమ్మిరెడ్డిపల్లి వాగు నుండి రాత్రి పగలు అని తేడా లేకుండా జేసీబీతో తవ్వి దర్జాగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు. అయినా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు అధికారులు. ఈ అక్రమాలను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటాం.. ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు ఇప్పుడు చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామునుండే కొమ్మిరెడ్డిపల్లి వాగు నుండి దాదాపు 15 ట్రాక్టర్ లతో ఇసుకను ఊరు దాటించడం మొదలు పెట్టారు. అయినప్పటికీ.. రెవిన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇసుక మాఫియాతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అన్నారు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్. ఇసుక మాఫియాకు ఒకవైపు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటే.. మరోవైపు సంబంధిత అధికారుల సపోర్ట్ ఉందని ఆరోపించారు. పూర్తి సమాచారం ఉన్నప్పటికీ.. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు అధికారులు జంకుతున్నారని ప్రవీణ్ ఆరోపించారు.
3 ట్రాక్టర్లు.. 6 భారత్ బెంజ్ లు అన్నట్టు ఇసుక మాఫియా సాగుతోందని ఆయన అన్నారు. కండ్ల ముందే దందా సాగుతున్నా అధికారులు పట్టి పట్టనట్టు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా ఇసుక మాఫియా చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రవీణ్.