మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్-1. దీన్నే షార్ట్ కట్ లో పీఎస్-1 అని కూడా పిలుస్తారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. మణిరత్నం మీద ఇష్టంతో దిల్ రాజు రిలీజ్ చేసిన ఈ సినిమా, ఏమాత్రం ఆకట్టుకోలేదు. పూర్తిగా తమిళ వాసనలు, పక్కా తమిళ కథతో తెరకెక్కిన మూవీ కావడంతో తెలుగు ప్రేక్షకులకు ఇది ఎక్కలేదు.
ఇదిలా ఉండగా, ఇప్పుడీ సినిమా బుల్లితెర వీక్షకులకు కూడా ఎక్కలేదు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తాజాగా జెమినీ ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేశారు. తొలి ప్రసారంలో ఈ సినిమాకు కేవలం 2.17 రేటింగ్ మాత్రమే వచ్చింది.
విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్ లాంటి ఆర్టిస్టులు, రెహ్మాన్ సంగీతం ఉన్నప్పటికీ టీవీ ఆడియన్స్ ఈ సినిమాను పట్టించుకోలేదనే విషయం రేటింగ్ చూస్తే అర్థమౌతుంది.
మరోవైపు ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా పొన్నియన్ సెల్వన్ పార్ట్-2ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే సమ్మర్ ఎట్రాక్షన్ గా పీఎస్-2 సినిమా థియేటర్లలోకి వస్తోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాసు టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.