పొన్నియిన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా దిగ్గజ దర్శకులు మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్ , జయం రవి , కార్తి, ఐశ్వర్య రాయ్ , త్రిష వంటి భారీ తారాగణంతో ఈ చిత్ర మొదటి భాగం గతేడాది విడుదలైంది. తమిళుల నేపథ్యానికి చెందిన కథ కావడంతో కోలీవుడ్‌లో హిట్ తెచ్చుకున్న ఈ సినిమా మిగతా భాషల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడం ఫస్ట్ పార్ట్‌కు మైనస్‌గా మారింది.
ఈ నేపథ్యంలో అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉండనుందని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా PS-2 ట్రైలర్‌ను కమల్ హాసన్ విడుదల చేయగా.. అనుకున్నట్లుగానే పాత్రల మధ్య అనేక ట్విస్టులతో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది. ఈ ట్రైలర్ సముద్రంలో జరిగే ఫైట్‌తో మొదలైంది. వారసుడు అయిన ‘అరుల్మొళి వర్మన్ (జయం రవి)’ చనిపోయాడని భావించి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజు ‘అరుల్మొళి వర్మన్’ను చనిపోయాడని వార్త అందుకున్న పాండ్యులు.. ‘ఆదిత్య కరికాలుడు (విక్రమ్)’ని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు.
ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో PS-2 ట్రైలర్ సాగింది. స్టన్నింగ్ విజువల్స్‌కు తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ నటన ఆకర్షించింది. చెన్నైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తి, విక్రమ్, జయం రవి, శోభిత ధూళిపాళ సహా మూవీ కాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించి ఐశ్వర్య రాయ్ న్యూ లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు.
ఈ పోస్టర్‌ను షేర్ చేసిన ఐశ్వర్య.. ‘వారి కళ్లలో నిప్పు. హృదయాల్లో ప్రేమ. కత్తులపై రక్తం. సింహాసనం కోసం పోరాడేందుకు చోళులు తిరిగొస్తారు’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గతేడాది విడుదలైన మొదటి భాగం (PS-1) ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రత్యేకించి తమిళనాడులో రూ. 183 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కాగా.. ఈ చిత్రం ద్వారానే ఐశ్వర్యరాయ్ బచ్చన్ దాదాపు పదేళ్ల తర్వాత కోలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఐశ్వర్య నందిని, ఆమె మూగ తల్లి మందాకిని దేవిగా డ్యూయల్ రోల్లో నటించింది.