స్మార్ట్ ఫోన్లు వచ్చాక చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైల్ ఆన్‌లైన్ గేమ్స్‌కి బాగా అలవాటు పడుతున్నారు. అందులోనూ ఫైరింగ్ గేమ్స్‌ను మరింత ఆసక్తితో ఆడుతున్నారు. ఇలాంటి గేమ్స్‌లో ఎంతోమందిని ఆకర్షించింది పబ్ జీ. ఈ ఆట చాలా మంది బానిసలుగా మారి.. వింత వింతగా ప్రవర్తించటం, తీవ్ర నిర్ణయాలు తీసుకోవటం వంటి ఎన్నో కథనాలు వార్తల్లో చూస్తునే ఉన్నాం. తాజాగా పబ్ జీ గేమ్‌కి బానిసైన ఓ బాలుడు చేసిన పనికి పోలీసులు హడలిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైల్వే ప్రయాణికులను వెయిట్ చేయించాడు. అసలు ఏం జరిగిందంటే..?
కర్ణాటకలోని బెంగళూరులో పబ్జీకి బానిసైన ఓ బాలుడు చేసిన పని రైల్వే పోలీసులకు కాసేపు కలవరపెట్టంది. బాలుడికి నిత్యం తన స్నేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడే అలవాటు ఉంది. అయితే, మార్చి 30న తన స్నేహితుడు రైలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారి ఆటకు అంతరాయం కలుగుతుందని భావించిన ఆ బాలుడు.. యళహంక నుంచి కాచిగూడ వెళ్తున్న రైలులో బాంబు ఉందని రైల్వే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తీరా దర్యాప్తు చేపడితే అది ఫేక్ కాల్ అని తేలింది.
మార్చి 30న బాలుడి స్నేహితుడు యళహంక రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే, మధ్యాహ్నం రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. రైలులో బాంబు పెట్టామని అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ లో పేర్కొన్నారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడివక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్‌లో బాంబు కోసం తనిఖీలు చేపట్టారు. మూడు గంటల పాటు ప్రయాణికులను అనుమతించలేదు. ఆ తర్వాత కాల్ వచ్చిన నంబర్‌కు అధికారులు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇక అధికారులు దర్యాప్తు చేయగా.. బాలుడు యళహంక నివాసి అని, పబ్జీ ఆటకు బానిసయ్యాడని తెలిసింది. ఫోన్ చేసిన అతడు మైనర్ కావడం వల్ల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.