మంత్రి మల్లారెడ్డి భూబాగోతాల గురించి ఇప్పటికే కథలు, కథలుగా విన్నాం.. చెప్పుకున్నాం.. ఆయనే స్వయంగా ఓ రియల్టర్‌కు ఫోన్ చేసి తన వాటా ఏదని ప్రశ్నించిన వైనాన్ని చూసి తెలంగాణ సమాజం కూడా నివ్వెరపోయింది. ఆ ఆడియోలోని మాటలు తనవి కావు అని మల్లారెడ్డి ఎంత సమర్థించుకున్నా.. ఆయన కబ్జాల అలవాటు గురించి అప్పటికే తెలిసి ఉండటంతో ప్రజలెవరూ నమ్మలేదు. మంత్రి అయిన తర్వాత కూడా ఇదేం బుద్ధి అని ఇప్పటికీ ఈసడించుకున్నారు. ఇంత జరిగినా మంత్రి మల్లారెడ్డి ఏం మారినట్టుగా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తన నియోజకవర్గంలో ఏకంగా తెలంగాణ ఉద్యమకారుడి భూమికే ఎసరుపెట్టారు ఆయన.
జవహర్‌నగర్ మున్సిపాలిటీలోని 5 వార్డులో ఉండే వెంకటేష్ గౌడ్.. కారింగుల నర్సింగ్‌రావునగర్ కాలనీలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఇటీవల ఆ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన స్థానిక కార్పొరేటర్ మురుగేష్.. నిర్మాణం మొదలుపెట్టాలంటే ప్లాటుకు రూ. లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు వెంకటేష్ గౌడ్ నిరాకరించాడు. దీంతో మురుగేష్ పగతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆ స్థలాన్ని వెంకటేష్ గౌడ్‌కు దక్కకుండా చూడాలని పథకం వేశాడు. తనకున్న అధికారంతో అదే స్థలంలో సెంట్రల్ లైటింగ్‌కు ఏర్పాట్లు చేయించాడు.అంతటితో ఆగకుండా మంత్రి మల్లారెడ్డికి విషయం చెప్పి.. ఆయనతోనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించాడు.
ఇదంతా చూసిన వెంకటేష్‌గౌడ్‌కు కడుపు మండిపోయింది. తన స్థలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడమేంటని మల్లారెడ్డిని అందరి ముందే కడిగిపారేశాడు. తాను ఓట్లు వేయిస్తే గెలిచి, ఇప్పుడు తననే నిలువునా ముంచుతున్నారా అంటూ నిలదీశాడు. అంతమందిలో పరువుపోవడంతో మంత్రి ఒక్కమాట మాట్లాడలేదు. అక్కడే ఉన్న కొందరు నేతలు వెంకటేష్‌గౌడ్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వినకపోవడంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. మంత్రి, కార్పొరేటర్ కలిసి.. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, తనకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని వెంకటేష్ గౌడ్ మండిపడ్డాడు. వెంకటేష్ గౌడ్ వ్యవహారం చూసిన వారంతా… ఆయన మాల్లారెడ్డి ఏం మారలేదు అని గుసగుసలాడుకుంటున్నారు.