విద్యుత్ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కరెంట్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ చేపట్టిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో మాట్లాడారు. డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని.. ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో అప్పులపాలు అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు రేవంత్. ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.6 వేల కోట్లు మాత్రమే ఇస్తోందని వివరించారు. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. పంపిణీ చేస్తున్న కరెంట్ లో 30 శాతం వినియోగదారు ప్రభుత్వమేనని.. విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు రూ.11,000 కోట్లు ఉంటే.. రూ.8,900 కోట్ల అప్పు భారాన్ని కేంద్రం తీసుకుందని వెల్లడించారు రేవంత్. ఉదయ్ స్కీమ్ లో చేరడంతో డిస్కంల అప్పు రూ.2 వేల కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని వివరించారు.
బిల్లులు చెల్లించని వినియోగదారులపై చర్యలు తీసుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వంపైనా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. వినియోగదారులపై భారం మోపే డిస్కంలు.. ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్, సిద్దిపేటలో బకాయిలు ఎక్కువగా ఉన్నాయని… నిర్వహణా లోపం కారణంగా తీగలు వేలాడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్న కారణంగా.. వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదన్నారు. రాజకీయ బాసుల మెప్పు కోసం సంస్థకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.