– కాంగ్రెస్ విశ్వరూపం
– జనంతో పోటెత్తిన ఇంద్రవెల్లి
– అన్నిదారులూ అక్కడికే
– లక్షలాదిగా తరలివచ్చిన జనం
– తెలంగాణ అవినీతి సర్కార్ పై
కాంగ్రెస్ నేతల ముక్తకంఠం
– దళిత ద్రోహులను తరిమికొడదాం
– రేవంత్ హుంకారం..జనంలో ఉత్సాహం
– దళిత గిరిజన దండోరా గ్రాండ్ సక్సెస్
అరుణారుణ అమరుల స్థూపం సాక్షిగా .. ఇంద్రవెల్లి జనసంద్రమైంది. కేసీఆర్ ఏడేళ్ల అవినీతి, అసమర్థ, ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు జెండా ఎగిరింది. చారిత్రక ఇంద్రవెల్లి వేదికగా సమరశంఖం మోగించిన రేవంత్ టీం.. గడీల గోడలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగరేయటం ఖాయమని… లక్షలాది జనం జయజయ ధ్వానాల మధ్య ప్రకటించింది. బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం చూపి… బతుకులేని తెలంగాణగా మార్చిన కేసీఆర్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని సభ గర్జించింది. ఒక రకంగా రేవంత్ నవ నాయకత్వానికి అగ్నిపరీక్ష లాంటి ఇంద్రవెల్లి సభ హస్తం నేతలే ఊహించని స్థాయిలో విజయవంతమైంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ..మారుమూల గ్రామాల నుంచి సైతం ఉదయం నుంచే ఇంద్రవెల్లికి వేలాదిగా తరలిరావటం మొదలైంది. లక్ష మందితో దొర గడీల పునాదులు కదిలేలా గర్జిస్తామన్న రేవంత్ మాటలకు… తెలంగాణ కదిలివచ్చింది. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ప్రకారమే మధ్యాహ్నానికే లక్షకు పైగా జనం చేరుకోగా…సాయంత్రానికి లక్షన్నర పైనే జనం వచ్చి వుంటారనేది అంచనా. మరోవైపు విశ్లేషకుల అంచనాలు పటాపంచలు చేస్తూ… వేదికపై కాంగ్రెస్ సీనియర్లంతా చేయి చేయి కలిపి, ముక్తకంఠంతో నినదించటం.. తెలంగాణ కాంగ్రెస్ పునర్వైభవానికి సంకేతం.