మాటతప్పని మడమ తిప్పని నాయకుడు అనేది రాజకీయాల్లో బాగా ప్రాచుర్యం చెందిన మాట. అయితే, ఈ మధ్యకాలంలో ప్రతీఒక్కరూ ఈ ట్యాగ్ లైన్ తగిలించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మాటలు వింటున్న జనం ఏమనుకుంటారో అని కాస్త కూడా ఆలోచించడం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాటతప్పని ప్రభుత‌్వమేనట. స్వయంగా ఈ మాటలు చెప్పింది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
వరంగల్ లో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ.. ఓ జీవోను విడుదల చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి పనిలో పనిగా ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను భజన చేయడం మొదలుపెట్టారు. పార్టీ నేతలు.. తమ బాస్ లకు భజనలు చేయడం అలవాటుగా మారిపోయినప్పటికీ.. ప్రజల ఏమనుకుంటారో కాస్త ఆలోచించాలి కదా? కేసీఆర్ ప్రభుత్వం మాటతప్పని ప్రభుత్వమని ఊదరకొట్టిన మంత్రికి.. ప్రభుత్వం ఎన్ని విషయాల్లో మాట నిలబెట్టుకుందో చెప్పాలని సోషల్ మీడియాలో పలువురు నిలదీస్తున్నారు.
తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని మాటిస్తున్నానని.. మాటిస్తే తలైనా తీసుకుంటా కానీ.. మాటతప్పనని ఏడేళ్లు క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు సరికదా.. కనీసం మూడెకరాల భూమిస్తానని చెప్పిన కేసీఆర్ మాటతప్పినట్టు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట ప్రకటనలు చేసి.. మళ్లీ మాటతప్పుతున్నారని.. దీన్ని ఏమంటారు మంత్రిగారు? అని గుర్తు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీం ఓసారి గుర్తు చేసుకోండి.. ఎంత వరకు మీ ప్రభుత్వం మాట మీద నిలబడిందో తెలుస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఏడాది క్రితం జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి పది వేలు ఇస్తామని చెప్పారు. మొన్న జరిగిన హుజూరాబాద్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తామని ప్రకటన చేసింది ఈ ప్రభుత్వమే కదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా.. మీ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం ఎలా అవుతుందని నిలదీస్తున్నారు.