తెలంగాణలోని చాలా ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు లేవు. ఇలాంటి సమయంలో ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు అంతా అధికారుల నెత్తిన పడేసి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లా నారాయణపూర్ గ్రామానికి చెందిన బాలికకు ఫిట్స్ వచ్చాయి. చెన్నూరు హాస్పిటల్ కు తరలించేందుకు కుటుంబసభ్యులు 108కు కాల్ చేశారు. అంబులెన్స్ గ్రామ శివారులోని వాగు వరకు వచ్చింది. బాలిక సోదరులు వాగు దాకా స్కూటీపై తీసుకొచ్చారు. అయితే వర్షాలకు వాగు ఉప్పొంగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇద్దరు సోదరులు తమ చెల్లెలిని భుజాలపై ఎత్తుకొని అతి కష్టం మీద దాటారు. అంబులెన్స్ లో చెన్నూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
ఈ సంఘటనపై నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాము ఓట్లేసి గెలిపిస్తే… ఇక్కడి ప్రజల కష్టాలను గాలికొదిలిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని మండిపడుతున్నారు. నియోజకవర్గానికి బాల్క సుమన్ ఓ అతిథిలా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.