లక్ష్మి కాగితాలు చేతిలో పట్టుకుని వీరయ్య దగ్గరికి పోయింది. ‘‘చిన్నాయనా.. మా ఆయన పోయిండు గందా.. ఆ రెండు సెంట్ల జాగా నా పేరు మీదికి తెచ్చుకోవాల. అప్పుడుగాని లోను ఇయ్యరంట. ఎవురిని అడగాలి.. ’’..
విన్న వీరయ్య ‘‘దానికి ఇంత పరేషాన్ ఎందుకు లక్ష్మి. మన కేసీఆర్ సారు.. కొత్త చట్టం తెచ్చిండుగా. చానా వీజీ. మన టీఆర్ఎస్ వెంకటి ఉన్నాడుగా.. ఆడికాడికి పో.. ఆడు పైసలు అడుగుతాడు.. అయిచ్చేయ్.. ఆడు చూసుకుంటాడు. ఆడు పెట్టమన్నకాడ సంతకం పెట్టు గంతే. పైసలు జర తక్కువ చేయమని నేను చెబుతాలే.. మనోడే గందా.. వింటాడులే‘‘ అన్నాడు యమ ధీమాగా.
‘‘మరి.. వీఆర్ఏని అడిగితే ఏవేవో కాగితాలు కావాలంటున్నడు. పైగా పైన తహశీల్దార్ కాడికి పోవాలంట.. ఆయనడిగినవి కూడా ఇయ్యాలంట‘‘ అంది భయంగా లక్ష్మి.
‘‘అరె.. నేను చెబుతున్నా గందా. వీఆర్వోలను అందరినీ ఒక్క పెట్టున పీకేసి.. కొత్తగా వీఆర్ఏలను పెట్టారు గందా.. వాళ్లంతా మన టీఆర్ఎస్సోళ్లే… ఇక తహశీల్దార్ అంటవ.. మన గులాబీ జెండావోళ్లు చెప్పిందే గందా వాళ్లు చేయాల్సింది.. అన్నీ పార్టీవోళ్లు చూసుకుంటారు.. నువ్వు సంతకం పెట్టు.. పైసలు కొట్టు గంతే.. సమజైందా‘‘ అన్నాడు గట్టిగా.. అలాగేనని తలూపి పోయింది లక్ష్మి.
ఈ సీన్ మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కనపడుతుంది. రెవెన్యూ చట్టం చేసే పని ఇదే.. అవినీతిని అరికడతామంటూ గప్పాలు కొట్టి.. అవినీతిని కేంద్రీకృతం చేసి.. కేవలం గులాబీ దండోళ్లు దండుపాళ్యం బ్యాచ్ లాగా దోచుకోవడానికే ఈ చట్టం. వ్యవస్ధ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని.. భూదందా చేసుకోవడానికే ఈ చట్టాన్ని వాడతారనేది అందరికీ తెలిసిన సత్యం. అయినాగాని.. దాన్నొక ఉత్తమోత్తమ చట్టంగా.. అద్భుతమైనదిగా కీర్తిస్తూ.. మీడియా కూడా ఆకాశానికెత్తుతోంది.
రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి పేరుకుపోయిందనడంలో సందేహం లేదు. కింది నుంచి పై దాకా అవినీతి కోరలు చాచింది. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఇప్పుడా అవినీతి బూచిని చూపెట్టి.. తాము స్వయంగా అవినీతిని పక్కాగా.. ఎవరికీ దొరకకుండా సిస్టమేటిక్ గా చేసుకోవడానికి ఈ చట్టాన్ని తయారు చేసుకున్నారు. ఆల్రెడీ ఒకసారి భూరికార్డుల ప్రక్షాళన అని మొదలెట్టి.. ఎన్ని భూములు మింగేశారో.. ఆ తతంగాలన్నీ చూశాం. మళ్లీ ఇప్పుడు అదే పేరు చెబుతూ ఈ చట్టాన్ని తెచ్చారు. భూములపై ఏది తెచ్చినా.. ఆ భూమిపై దందా చేయడానికేనని చరిత్ర చెబుతోంది. అలీబాబా నలభై దొంగలు నుంచి అలీబాబా ఒక్కడే దొంగ అన్నట్లు ఇప్పుడు పరిస్ధితి మారబోతుంది.
ఇప్పుడు ఈ చట్టం చేతిలో పెట్టుకుని.. దేవుడి మాన్యం భూములు, అసైన్డ్ భూములు.. అన్నీ చేజిక్కించుకుంటారు. తర్వాత తమ చేతిలో ఉన్న వ్యవస్ధ ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేయించుకుంటారు. ఆన్ లైన్ రికార్డులు సైతం తారుమారు చేసి.. అంతా సక్రమంగా ఉన్నట్లే.. అక్రమ పద్ధతుల్లో పని కానించేస్తారు. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. అంతా నడిచిపోతున్నట్లే కనపడుతుంది.. భూచక్రం తిరుగుతున్నట్లే ఉంటుంది.. ఆ చక్రం ఎటు తిరుగుతుందో ఎవడూ కనిపెట్టలేడు. పైగా ఈ చట్టం దేశానికి ఆధర్శం.. దేశమంతా తెలంగాణవైపు చూస్తుందంటూ ఎచ్చు కబుర్లు చెబుతూ.. మరింత మాయ చేస్తున్నారు. ఏమైనా మాయ చేయడంతో కేసీఆర్ ని మించిన మంత్రగాడెవరూ లేరు కదా.