‘నలుగురూ నవ్విపోదురు గాక, నాకేమిటి సిగ్గు’ అన్నట్లుగా వుంది సీపీఐ వైఖరి. అందరూ ఊహించిందే జరిగింది. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలలో సీపీఐ టీఆరెస్‌కు మద్దతు ప్రకటించింది. సోషల్ మీడియాలో మాత్రం వామపక్ష వాదులు, సీపీఐ కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు.
సీపీఐ నుంచి గెలిచిన ఒక్కగాని ఒక్క ఎమ్మెల్యే (రవీందర్ నాయక్)ని, పార్టీ సానుభూతిపరులు పెట్టిన పత్రిక (మన తెలంగాణ)ని గుంజుకుంటే నోరు మెదపని నాయకత్వం సిగ్గులేకుండా ఇప్పుడు టీఆరెస్‌కు మద్దతు ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరి పదవుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. మద్దతు ఇచ్చే బదులు సీపీఐని టీఆరెస్‌లో విలీనం చేస్తే పోలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
కమ్యూనిస్టులు అధికార పార్టీ అనే బండి ఆగితే నెడతారు, సాగితే ఆపుతారు అన్న విమర్శను నిజం చేశారు అంటూ విసుర్లు విసురుతున్నారు నెటీజన్స్. టీఆరెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు, ఇలా అన్ని వర్గాలూ రోడ్డెక్కుతున్నారు. ఈ సమయంలో ఆ వర్గాలకు అండగా ఉండాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ అధికార పార్టీ చంకలో చేరడం ఏమిటి అని నిలదీస్తున్నారు.
కొందరయితే ఎంతకు అమ్ముడు పోయారు అంటూ ప్రశ్నిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. మీరు పై స్థాయిలో అమ్ముడు పోతే లేనిది మీము కింద స్థాయిలో అమ్ముడుపోతే తప్పేమిటి అంటున్నారు.
‘అయినా మీరు చెబితే మీము టీఆరెస్‌కు వేస్తామనుకుంటున్నారా.. అలా జరగదు. ఎందుకంటే మీకంటే సోయి లేదు జనానికి లేదనుకుంటున్నారా. ప్రజలు మీకంటే చైతన్యవంతులు.. ఎవరికి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో వారికి బాగా తెలుసు. మీ దృష్టిలో ప్రజలు గొర్రెలు. మీరు ఏమి చెప్పినా వింటారు అనుకుంటే పొరపాటే. తప్పులో మీరు కాలు వేసినట్టే. ప్రజలది షార్ట్ మెమరీ. పాత విషయాలు గుర్తు పెట్టుకోరు. ఎప్పటివి అప్పుడే మరచిపోతారని మీరనుకుంటే అది మీ భ్రమ’ అని తిట్టిపోస్తున్నారు.