తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయం. కేసీఆర్ ఆమరణ దీక్ష అన్నారు.. హరీష్ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. కానీ.. అగ్గిపెట్టె మాత్రం దొరకలేదు. ఈ విషయంపై ఇప్పటికీ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తూనే ఉంటాయి ప్రతిపక్షాలు. కేసీఆర్, హరీష్ ఉద్యమ సమయంలో డ్రామాలు ఆడారని.. సినీ స్టార్స్ కంటే గొప్ప నటులని అంటుంటాయి. పెట్రోల్ కొన్న హరీష్ రావు 50 పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామా కాదా..? అది తెలియక ఎందరో యువకులు కాల్చుకోలేదా..? అని ప్రశ్నిస్తుంటాయి.
ఇక నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా..? ఆ సమయంలో ఉన్న డాక్టర్ వేరే పార్టీలో ఉంటే కష్టమని.. అతనికి గులాబీ కండువా కప్పలేదా..? అనే విమర్శల బాణాలు ఇప్పటికీ ప్రగతి భవన్ వైపు వెళ్తూనే ఉంటాయి. కేసీఆర్, హరీష్ ఆనాడు ఎన్నో నాటకాలు ఆడారని.. వారివల్ల ఎందరో అమాయకులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూనే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. మరి.. దీని ప్రాతిపదికన ఆనాటి ప్రభుత్వం కేసీఆర్, హరీష్ పై కేసులు పెట్టి చర్యలు తీసుకుని ఉంటే.. వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉండేవారని ప్రశ్నిస్తున్నాయి.
ప్రస్తుతం జర్నలిస్ట్ మల్లన్న ఇష్యూనే తీసుకోండి.. టీఆర్ఎస్ నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్నాడని కక్ష గట్టి అక్రమ కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆనాడు ఎంతోమంది యువకులను ఆత్మహత్యకు ప్రేరేపించిన హరీష్, కేసీఆర్ పై కూడా అప్పటి సర్కార్ కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోమని హెచ్చరిస్తున్నాయి. ఏదైనా తప్పు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవాలి గానీ.. అక్రమంగా కేసులు పెట్టడం ఏంటి..? జైల్లో వేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులపై కేసీఆర్ తీరు దారుణంగా ఉందని మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.