దేశానికి గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అలాగే, రైతులకు ఇంతలా మేలు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా బాగుపడలేదన్నారు. అందుకే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని చెప్పారు. దేశాన్ని సుదీర్ఘ కాలంగా పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీల దుష్పరిపాలన వల్లే ఈ దుష్ప్రభావాలు ఏర్పడ్డాయని మండిపడ్డారు.
దేశాన్ని సుదీర్ఘ కాలం కాంగ్రెస్, మరి కొన్నేండ్లు బీజేపీలు పాలించాయన్నారు. ఆ పార్టీల పాలనలో దేశంలో ఆకలి, దుర్భిక్షం తగ్గక పోగా, మరింత ఎక్కువ అయ్యాయని చెప్పారు. అందుకే దేశం మొత్తం సీఎం కేసీఆర్ రాక కోసం చూస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పొగుడుతోందన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే సరికి తిడుతోందన్నారు.
బీజేపీ ద్వంద్వ వైఖరిని తిప్పి కొట్టాలన్నారు. ఆ పార్టీ నేతలు గ్రామాల్లోకి వస్తే నిలదీయాతలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు సోదాహరణంగా వివరించారు. దేశంలో కేసీఆర్ లాగా ఎవరూ ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ చేస్తున్న ఇంత గొప్ప పరిపాలన తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.