దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చోటుకో మాట, పూటకో హామీ ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా అందరికీ దళిత బంధు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసినవారే.. ఇప్పుడు అందరిలో ఆ కొందరిని కూడా కలపడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకూ దళిత బంధు ఇవ్వాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఉద్యోగం ఉందనే కారణంతో రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం కూడా కుదరదని.. ఏ ప్రభుత్వ పథకానికీ అర్హత ఉండదని తెగేసి చెప్పే ప్రభుత్వం.. మరి రూ.10 లక్షల భారీ లబ్ధి చేకూర్చే దళిత బంధును మాత్రం వారికి ఎలా అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నవారికి కొత్తగా సర్కార్ సాధికారత కల్పించాల్సిన అవసరం ఏమిటని నిలదీస్తున్నారు.
ఇప్పటికే రైతు బంధు లబ్ధిదారుల విషయంలో అనేక అభ్యంతరాలున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా.. రూ.కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని విమర్శలు ఉన్నాయి. ధనవంతులు, భూములు సాగుచేయనివారు, ఆదాయపు పన్ను కట్టేవారు, కమర్షియల్ ల్యాండ్‌లకు కూడా రైతు బంధును అమలు చేయడంపై అనేక అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు హుజురాబాద్ ఉప ఎన్నికకు దారితీయడానికి గల కారణాలలో రైతు బంధు కూడా ఒక్కటి అని .. దానిపై ప్రశ్నించినందుకే ఈటలను బయటకు పంపించారని అందరూ చెప్పుకుంటుంటారు. అలాంటిది.. అంత సులువుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.10 లక్షలు ఇచ్చి.. ఆ ధనవంతులను మరింత ధనవంతులని చేయడమేనా సాధికారత? అని కేసీఆర్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారు.