తెలంగాణలో ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఒక్కో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరుగుతోంది. గతంలో ఉండే ఎమ్మెల్యేకి.. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి తేడాలను స్థానిక ప్రజలే గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
నాలుగు కేసులు, ఆరు దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, వసూళ్లు, బెదిరింపులు ఇవి కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి పాలనలో జరుగుతున్నవి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే చుట్టూ కొందరు రౌడీలను, కొందరు పోలీసులను పెట్టుకొని రాక్షస పాలన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం చేతిలో ఉందని పట్నం రౌడీ బ్యాచ్ విర్రవీగిపోతున్నారని అంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక పరిష్కారం దిశగా వెళ్లాయని.. 2018 లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక మళ్ళీ ఆ సమస్యలు అలాగే ఉండిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని ఓడించి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించిన కొడంగల్ ప్రజలకు పట్నం రౌడీ బ్యాచ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఆలస్యంగా మేలుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే తిరగబడటం మొదలు పెట్టారని.. 1500 జనాభా ఉన్న హకీం పేట్ గ్రామానికి 100 మంది పోలీసులతో రావాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేకి ఏర్పడిందని అంటున్నారు. కొడంగల్ లో పట్నంకు ఉన్న ప్రజా మద్దతు ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఘటన సరిపోతుందని కాంగ్రెస్ కేడర్ సెటైర్లు వేస్తున్నారు. రౌడీయిజం నమ్ముకున్న స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే మామ హనుమంతు రెడ్డి స్థానికంగా మరో వనమా రాఘవలా తయారయ్యారని అంటున్నారు. హనుమంతు రెడ్డి అరాచకాలు భరించలేక సొంత గ్రామ ప్రజలు రెండు సార్లు తరిమికొడితే కోస్గి పోలీస్ స్టేషన్ లో తల దాచుకున్నాడని సమాచారం. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి గ్రామాల్లోకి వచ్చే ధైర్యం లేక వందల మంది పోలీస్ బందోబస్తుతో దండయాత్ర చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొడంగల్ పట్టణంలో ఎవరైనా ఏ చిన్న బిజినెస్ చేయాలన్నా.. ఎమ్మెల్యేకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. దీంతో కొడంగల్ ప్రజలు రావణ సంహారం ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారని టాక్.
కొడంగల్ లో ముఖ్యంగా కోస్గి బస్ డిపో, కోస్గి హాస్పిటల్, మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజ్ భవనాలు, డిగ్రీ కాలేజ్ భవనం, మినీ స్టేడియం, కొడంగల్ కు సాగు, తాగు నీరు ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటిలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అన్ని పనులు స్టార్ట్ అయ్యాయి. కోస్గి బస్ డిపో కోసం సొంత డబ్బుతో స్థలం కొనివ్వడంతో పాటు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నుంచి నిధులు కూడా రేవంత్ తీసుకొచ్చారు. కానీ 2018 ఎన్నికల ముందు 5 మంది మంత్రులు కొడంగల్ పై దండయాత్ర చేసి అట్టహాసంగా బస్ డిపోకు మళ్ళీ శంకుస్థాపన చేశారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల ముందు హడావిడి చేసి.. ఎన్నికల తరువాత గాలికొదిలేశారని మండిపడుతున్నారు. ఇక్కడున్న మరో పెద్ద సమస్య కోస్గి ప్రభుత్వ హాస్పిటల్. 2018 ఎన్నికల ముందు వరకు చాలా స్పీడ్ గా జరిగిన హాస్పిటల్ నిర్మాణ పనులు నరేందర్ రెడ్డి గెలిచిన తరువాత పందుల నిలయంగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. చుట్టూ 40 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెనకబడిన కొడంగల్ నియోజకవర్గం పరిస్థితి 2009లో రేవంత్ ఎమ్మెల్యే అయ్యాక కాస్త మెరుగ్గా తయారైందని అంటున్నారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. తనకున్న పరిచయాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేశారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. చదువుకు ప్రాధాన్యత ఇచ్చిన రేవంత్.. 5 మండలాల్లో జూనియర్ కాలేజ్ భవనాల కోసం గైల్ అనే సంస్థ నుంచి నిధులు తీసుకొచ్చి కోస్గి, కొడంగల్ లో జూనియర్ కాలేజ్ భవనాలు ప్రైవేట్ కు ధీటుగా నిర్మించారని తెలుస్తోంది. మిగతా మూడు మండలాలకు కూడా నిధులు మంజూరు అయ్యాయి. అయితే అంతలోనే ఎన్నికలు రావడం.. పట్నం నరేందర్ రెడ్డి గెలవడంతో మిగతా మూడు మండలాల్లో కాలేజ్ భవనాలు అందని ద్రాక్షగా మిగిలిపోయాయని టాక్ వినిపిస్తోంది.
Advertisements
కొడంగల్ లో ఏది చూసిన 2018 కంటే ముందు జరిగినవే తప్ప పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక నియోజకవర్గంతో అభివృద్ధి ఎక్కడి వేసి గొంగలి అక్కడే ఉండిపోయిందని విమర్శలు ఉన్నాయి. స్థానిక సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, కేసులు తప్పవట. గెలిపించినందుకు పట్నం నరేందర్ రెడ్డి బ్యాచ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని వినికిడి. దీంతో అక్కడి ప్రజలు కూడా మనకెందుకు ఈ గోల.. మనం కూడా పట్నం బ్యాచ్ కి ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తే లెవెల్ అయిపోతుందని అనుకుంటున్నారట.