కబ్జాల చరిత్రలోనే ఇదో కొత్త కథ. అధికార పార్టీ నేతల అక్రమాలను నిలదీయాల్సిన.. ప్రతిపక్షమే అడ్డంగా అమ్ముడుపోయిన విచిత్ర గాథ. హైదరాబాద్ నడిబొడ్డున.. పట్టపగలే జరుగుతున్న రాజకీయ నేతల కబ్జాకేళి ఇది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రామానాయుడు స్టూడియోను ఆనుకొని ఉన్న కొండమీది ఆంజనేయస్వామి ఆలయం మాయమవుతోంది. వందల ఏళ్ల కింద స్వయంభువుగా వెలసిన క్షేత్రం రాజకీయ నేతల స్వార్థానికి నేలమట్టం కాబోతోంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా.. అధికార, విపక్షాలకు చెందిన నేతలు ఈ బాగోతంలో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఫిలింనగర్ బీజేపీ కార్పొరేటర్ దండి వెంకట్‌పై కలిసి, తోడు దొంగలుగా మారి దేవుని సొమ్ముకే ఎసరు పెడుతున్నారని స్థానికులు, భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు.
గుట్ట కింద భారీ ఆలయాన్ని కడతామని స్థానికులు, భక్తులను మభ్యపెట్టి.. ఈ ఇరువురు నేతలు ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థకు చెందిన కబ్జాదారులకు లైన్ క్లియర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆలయం 10 ఎకరాల స్థలంలో ఉంటే.. కింద గుడిని 100 గజాల్లో కట్టిస్తామని చెబుతుండటంపై విస్తుపోతున్నారు. ఓ వైపు ఆలయం ఉన్న చోట అభివృద్ది చేయాలని తాము డిమాండ్ చేస్తోంటే.. రెడ్‌ఫోర్ట్ అక్బర్ కన్స్‌స్ట్రక్షన్ అనే నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయిన ఈ నేతలు ఆసలు ఆలయమే లేకుండా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా వారి ఆగడాలపై ప్రశ్నిస్తే ఇద్దరు నేతలు కలిసి బెదిరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులు, ఈ నేతలు కలసి ఆంజనేయస్వామి ఆలయంలో ఆగమశాస్త్రాన్ని అపవిత్రం చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు.
దేవాలయాల ప్రాణప్రతిష్టకైనా, విస్థాపనకైనా హిందూ సంప్రదాయం ప్రకారం ఆగమశాస్త్రాలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఏ శాస్త్రమూ పాటించకుండా. ఏ పూజారీ లేకుండా కేవలం ఎమ్మెల్యే దానం, కార్పొరేటర్ వెంకట్ కలిసి తమ చేతులతో ఆలయాన్ని విస్థాపన చేశారని మండిపడుతున్నారు. రెడ్‌ఫోర్ట్ అక్బర్ నిర్మాణ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసం.. హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని భగ్గుమంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఏ పార్టీ నేతలు, అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బీజేపీ అధిష్టానం స్పందించి కార్పొరేట్ వెంకట్‌పై చర్యలు తీసుకోవాలని,
ఆలయాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. మంత్రి కేటీఆర్ స్పందించి దానం ఆగడాలకు బ్రేకులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని.. ఆలయాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.