వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి 3 నెలలు దాటి అర్ద వార్షికంలోకి ఎంటర్ కాబోతుంది. కానీ ఇప్పటివరకు జగన్ మార్క్ పాలన స్టార్ట్ కాలేదు. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు జగన్ వైఫల్యానికి కారణాలు లేకపోలేదు. ఒకటి జగన్ అనుభవలేమి ఒక కారణం అయితే, ఇంకొకటి ప్రభుత్వం అంటే ఏమిటి అని తెలుసుకోవటానికే అతను ఇంకా సమయం తీసుకుంటున్నాడు. అందుకే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతున్నాడని అనలిస్టుల అభిప్రాయం.
ఏమైనా అధఃపాతాళంలోకి జారిపోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ని బంగారుబాట పట్టించి తమ భవితను మార్చేస్తాడని కలలు కన్న ఆంధ్ర ప్రజానీకానికి నిరాశ మిగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది నెలలు కాకపోతే ఎందుకు ఈ ఏడుపని పాలక పక్షం అనుకుంటున్నా.. జగన్ అడుగులు వేసే తీరు కూడా అంతా ఆశాజనకంగా లేదనే చెప్పాలి. గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలని, అసంబద్ద నిర్ణయాలను ప్రజలు తిరస్కరించే వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కట్టారన్న చిన్న విషయం జగన్‌కి తెలియకపోతే అధికారం కోసం చేసిన పాదయాత్ర బూడిదలో పోసిన పన్నీరే.
ఆయనెవరో ఒక మహానుభావుడు అన్నట్టు అధికారం పొందటం ముఖ్యం కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటం గొప్ప అన్న వాఖ్యలు కచ్చితంగా జగన్ ప్రభుత్వానికి సూట్ అవుతాయి. ఎంతసేపూ జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే మళ్ళీ మళ్ళీ తవ్వి వాటి వెనకాల పడుతూ, ఇదిగో పాము, ఇదిగో కప్ప అన్నట్టుగా వుంటే ప్రజలకు మాత్రం ఎంతకాలం వినే ఓపిక, చూసే నిలకడతనం ఉంటుందని అనలిస్టులు అంటున్నారు. జగన్ తన వైఖరిని మార్చుకొని పాలనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందేమో!!