పుస్తెలమ్మి అయినా పులస తీనాలని.. గోదావరి జిల్లాల్లో ఘనంగా చెప్తారు. మరి పులస చేపలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఎలాగైనా పులస చేపని పట్టుకోవాలని ప్రతి జాలరీ అన్వేషిస్తుంటాడు. అదృష్టం ఉన్నవారికే పులస వలలో పడుతుంది. అదీ సహనంగా వేటాడితేనే వలకు చిక్కుతుంది. ప్రస్తుతం వరద గోదావరి బాధల మధ్య పులస చేప హాట్ హాట్ సేలబుల్ ఐటమ్
పులస చేపలకు గోదావరి పుట్టినిల్లు. సహజంగా పులస చేప ధవళేశ్వరం బ్యారేజ్ దాటి రాదు. పులసను పట్టాలంటే అక్కడే పట్టాలి. ఎవరైనా జాలరి ఒక సీజన్లో రెండు పులస చేపలు అయినా పట్టాడంటే అర్జునుడిలా మత్స్యయంత్రం కొట్టినట్లు లెక్క.
పులస చేప వలలో పడిందంటే జాక్ పాట్ కొట్టినట్టే. పులస కిలో 2 వేల నుంచి 8 వేల దాకా రకాన్ని బట్టి ధర పలుకుతుంది. ఎవరికైనా నిగనిగలాడే వెండి చేప వలలో పడిందంటే అంత బరువు గల నిధి దొరికినట్టుగా సంబరపడతారు.
సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీది రాగానే ఇలస చేప పులసగా మారుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా నుంచి పులస వలస వస్తుంది. గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి పులస గోదావరి నదిలోకి ఎదురీదుతుంది.
గుడ్లు పెట్టగానే పులస చేపలు వెళ్లిపోతాయి. ధవలేశ్వరం బ్యారేజి దిగువన పులసలు బాగా దొరుకుతాయి. వలలో పడిన తర్వాత పులస చనిపోయినప్పటికీ రెండు రోజుల దాకా తాజాగా ఉంటుంది. పులస చేపలు రెండు రకాలు. అవి పోతు పులస. శనపులస.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పులస విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమి వంతెన దగ్గర జాతీయ రహదారి పక్కన పులస అమ్మకాలు జరుగుతున్నాయి.
ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే పులస చేపలను తినాలని అంతా ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. సెప్టెంబరు దాకా దొరికే పులస చేప పులుసు భలేగా ఉంటుందని భోజన ప్రియులు లొట్టలేస్తూ చెబుతున్నారు. ఆసక్తి ఉంటే చలో గోదావరి.