అనుకోని రోడ్డు ప్రమాదం ఆ అభాగ్యుడి కుటుంబాన్ని వీధినపడేసింది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో కారు రూపంలో వచ్చిన ఆపద అతని జీవితాన్ని కుదిపేసింది. సీన్ కట్ చేస్తే పోషించే దిక్కులేక అతని కుటుంబం ఇప్పుడు పస్తులుంటోంది. అయితే అతని కష్టానికి జిల్లా కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు కారణమైంది.
మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గత నెల 19న బైక్‌పై వెళ్తున్న పుల్లయ్య అనే వ్యక్తిని జిల్లా కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని అధికారులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. పుల్లయ్య ప్రాణాలతో బయటపడినా.. ప్రమాదంలో అతని నడుము భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. మెకాలు నుంచి కింది భాగం వరకుఓ కాలును కూడా తొలగించాల్సి వచ్చింది. దీంతో పుల్లయ్య సొంత పనులు కూడా చేసుకొలేని దుస్థితికి చేరుకున్నాడు.
అద్దె ఇంటిలో జీవిస్తున్న పుల్లయ్యకు ముగ్గురు పిల్లలున్నారు. అతడు తీసుకొచ్చే కూలీ డబ్బులే వారికి జీవనాధారం.ఇప్పుడుపుల్లయ్య ఏపని చేయలేని స్థితికి చేరడంతో అతని కుటుంబమంతా తీవ్ర ఇబ్బందులుపడుతోంది. నాడు ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే.. తన జీవితం ఇలా ఉండేది కాదని పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కలెక్టర్ చొరవ తీసుకొని తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.