స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత పేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. పుల్లారెడ్డి మనువడు ఏక్‌నాథ్ రెడ్డిపై వరకట్నం, గృహహింస కేసు నమోదైంది. వరకట్నం కావాలని వేదిస్తున్నారని ఆరోపిస్తూ అతని భార్య పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏక్‌నాథ్ రెడ్డి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. వీరుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్‌నాథ్ రెడ్డి అనుకున్నాడు. మెట్ల వద్ద.. రాత్రికి రాత్రే అడ్డు గోడ కట్టించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.
ఇదంతా గ్రహించిన ఏక్‌నాథ్ భార్య డయల్ 100 కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితురాలు తండ్రికి సమాచారం అందించారు పోలీసులు.
ఘటనా స్థలికి చేరుకున్న తన తండ్రితో కలిసి స్థానిక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఏక్‌నాథ్ పై వరకట్న వేధింపులతో పాటు గృహహింసకు పాల్పడుతున్నాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది అతని భార్య. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.