పంజ్ షీర్ ను సొంతం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు తాలిబన్లు. కానీ.. పంజ్ షీర్ వీరుల ముందు తాలిబన్ల పప్పులు ఉడకడం లేదు. కాల్పుల్లో దాదాపు 600 మంది తాలిబన్లు చనిపోయినట్లు రష్యాకు చెందిన స్పుత్నిక్ కథనాలు ప్రసారం చేస్తోంది. అంతేకాదు వెయ్యి మంది వరకు ఆఫ్ఘాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేతిలో బందీలుగా ఉన్నట్లు చెబుతోంది.
పంజ్ షీర్ కూడా తాలిబన్ల వశమైందని ప్రచారం జరిగింది. కాబూల్ సహా పలు ప్రాంతాల్లో తాలిబన్లు సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే 17 మందిని పొట్టన పెట్టుకున్నారు. కానీ.. పంజ్ షీర్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారన్న వార్తలు నిజం కాదని స్పుత్నిక్ కథనాలతో అర్థం అవుతోంది.
ప్రస్తుతం పర్యాన్ జిల్లాలో తాలిబన్లు, రెసిస్టెన్స్ దళాల మధ్య పోరాటం కొనసాగుతోంది. పంజ్ షీర్ కు వెళ్లే మార్గాలన్నింటిలో ల్యాండ్ మైన్స్ పెట్టడంతో తాలిబన్లకు చుక్కలు కనపడుతున్నాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పైగా రెసిస్టెన్స్ దళాలు డ్రోన్లు, బాంబులతో తాలిబన్లపై విరుచుకుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే 600 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారు.