వారంతా ఉన్నత చదువులు చదువుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం అడ్డదారులు తొక్కారు. సులువుగా డబ్బును సంపాదించడానికి మాదక ద్రవ్యాలను సరఫరా చేయడం మార్గంగా ఎంచుకున్నారు. దాని కోసం ఓ ఫుడ్ డెలివరీ యాప్ ను ఎంచుకున్నారు. కథ అడ్డం తిరగడంతో పోలీసు స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పూణెతో పాటు దాని సమీప ప్రాంతాల వారికి ఫుడ్ డెలివరీ యాప్ సాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. రోహన్ దీపక్ గవాయ్ (24), బానేర్ కు చెందిన సుశాంత్ కాశీనాథ్ గైక్వాడ్ (36), సింపుల్ సౌదాగర్ కు చెందిన ధీరజ్ దీపక్ లాల్వానీ (24) , సన్ సిటీ రోడ్ కు చెందిన దీపక్ లక్ష్మణ్ గెహ్లాట్ (25), వాకాడ్ లో ఓంకార్ రమేష్ పాటిల్ (25) లను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 17 గ్రాముల ఎల్‌ఎస్‌డీ, మరికొన్ని అక్రమ వస్తువులతో పాటు 53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్ లైన్ లో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో రోహన్ గవాయ్ ను ట్రాప్ చేసి అరెస్ట్ చేశారు. అతడిని విచారించడంతో ఒకరి తర్వాత ఒకరు ఇతర సహచరులను అరెస్ట్ చేశారు.
వీరంతా కూడా వాట్సాప్ లోని ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ బుక్ చేసి ఆర్డర్ వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ కి ప్యాకెట్లు ఇచ్చేవారు. డెలివరీ బాయ్స్ కు ఆ బ్యాగ్ లో ఏముందో తెలిసేది కాదు.