భీమా కోరేగాం కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో నిందితుల కంప్యూటర్లను హ్యాక్ చేసి తప్పుడు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టినట్టు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ సెంటినెల్ వన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ హ్యాకింగ్ క్యాంపెయిన్ కు పుణే పోలీసులకు మధ్య సంబంధాన్ని గుర్తించినట్టు తెలిపారు.
1818 నాటి భీమా కోరేగాం యుద్ధాన్ని స్మరించుకుంటూ భీమా కోరేగాంలో 31 డిసెంబర్ 2017న ఓ సభను నిర్వహించారు. ఆ శతాబ్ది ఉత్సవాల సందర్బంగా 1జనవరి 2018న హింస చెలరేగింది. ఈ కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు సుధీర్ ధావలే, రోణా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, అరుణ్ ఫెరిరా, సుధా భరద్వాజ్, వరవర రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారంతా ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారంటూ పోలీసులు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి నిందితుల ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఆధారాలను సంపాదించినట్టు తెలిపారు. ఈ మేరకు కొన్ని ఉత్తరాలు, పత్రాలను మీడియాకు పోలీసులు అందజేశారు. ఆ తర్వాత చట్ట ప్రకారం దాదాపు రెండేండ్ల తర్వాత వారికి ఆ ప్రతాల క్లోన్ డ్ కాపీలను అందజేశారు.
గతంలో వీటిపై మసాచుసెట్స్‌కు చెందిన డిజిటాల్ ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనాల్ కన్సల్టింగ్ పరిశోధనలు జరిపింది. నిందితుల ఎలక్ట్రానిక్ డివైజ్ లు హ్యాకర్లు హ్యాకింగ్ చేశారని తెలిపింది. నిందితుల కంప్యూటర్లలోని ఓ హిడెన్ ఫోల్డర్ లో సదరు ప్రవేశ పెట్టారని తెలిపింది. ఆ తర్వాత సెంటినల్ వన్ అనే సంస్థ 2022 ఫిబ్రవరిలో ఓ నివేదికను విడుదల చేసింది.
మోడిఫైడ్ ఎలిఫెంట్ పేరుతో ఇజ్రాయెల్ ఎన్ఎస్ఒ కంపెనీకి చెందిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించి భీమా కోరేగాం నిందితులతో పాటు పలువురు ప్రముఖలపై కూడ నిఘా పెట్టారని వెల్లడించింది.
తాజాగా సెంటినెల్ వన్ పరిశోధకులు జువాన్ ఆండ్రెస్ గెరెరో–సాడె, టామ్ హెగెల్‌లు సంచలన విషయాలు వెల్లడించారు. ఏ హ్యాకింగ్ ఏ కంప్యూటర్ నుంచి చేశారు, ఎవరు చేశారనే విషయాన్ని కనుగొన్నట్టు తెలిపారు. ఈ కేసులో నిందితుల అరెస్టు, పూణే కోర్టులో విచారణ సమయంలో దర్యాప్తు అధికారిగా ఉన్న పోలీసు అధికారి సొంత ఫోన్ కు ఈ హ్యాకింగ్ కు సంబంధం ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన అధికారికి, కంప్యూటర్లలో ఆధారాలను పెట్టిన వ్యక్తికి మధ్య సంబంధం ఉన్నట్టు తెలిపారు. ఆగస్టులో జరగబోయే బ్లాక్ హ్యాట్ సెక్యూరిటీ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞాన సదస్సులో మిగతా విషయాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.
రోనా విల్సన్, వరవరరావు, హనీబాబులను లక్ష్యంగా పెట్టుకుని వారికి సంబంధించిన మూడు ఈ మెయిల్ అకౌంట్లను 2018, 2019లలో హ్యాక్ చేసినట్టు చెప్పారు. వారి ఈ మెయిల్ అకౌంట్లకు ఉండే రికవరీ అడ్రస్, ఫోన్ నంబర్లకు అదనంగా మరో అడ్రస్, ఫోన్ నెంబర్లను చేర్చినట్టు వివరించారు. ఆ మూడు అకౌంట్లకు ఇలా చేర్చిన కొత్త రికవరీ ఈ మెయిల్ ఒకటేనన్నారు. ఆ రికవరీ ఈ మెయిల్ భీమా కోరేగామ్ కేసు దర్యాప్తు అధికారిదేనని తెలిపారు.
మొదట ఓ ఫిషింగ్ మెయిల్ ను పంపి రోనా విల్సన్ ఈ మెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఆ తర్వాత దానికి రికవరీ అడ్రస్ నెంబర్ మార్చారు. ఆ తర్వాత ఆ మెయిల్ నుంచి ఇతర నిందితులకు మెయిల్స్ పంపుతూ వారి ఈ మెయిల్ అకౌంట్లనూ హ్యాక్ చేసినట్టు పేర్కొంది.