యూపీలోని మొరాదాబాద్ లో 17 ఏళ్ళ బాలికపై నలుగురు అత్యాచారం జరిపారు. వారిని వదలొద్దని, కఠిన చర్య తీసుకోవాలని పోలీసులను కోరుతూ ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది . తమ ఇంటి సమీపంలోనే ఉన్న వీరు తనను ఎన్నోసార్లు వేధించారని, ఖాకీలకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 10 రోజుల తరువాత ఆమె సూసైడ్ నోట్ రాసి బలన్మరణం చెందింది.
దుండగులు అగ్రవర్ణాలకు చెందినవారని. దళితులమైన తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారుల ఆదేశాలపై పోలీసులు నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వివేక్ సింగ్ అనే ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన రెండు గంటల్లోనే బెయిల్ పై విడుదలయ్యాడు.
12 వ తరగతి చదువుతున్న ఈ బాలికను దుండగులు కొన్ని నెలలుగా వేధించినట్టు తెలిసింది. హోలీ తరువాత తన కూతురు స్కూలుకు వెళ్తుండగా వీరిలో ముగ్గురు ఆమెపై దాడి చేశారని, దీంతో ఆమెను స్కూలు మాన్పించామని మృతురాలి తండ్రి తెలిపారు. ఈ నెల 8 న వివేక్ సింగ్ ఏకంగా తమ ఇంట్లో దురుసుగా ప్రవేశించి రివాల్వర్ చూపుతూ తన కూతురుపై అత్యాచారం చేయబోయాడన్నారు.
ఇలాంటి దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే తన కుమార్తె బతికి ఉండేదని ఆయన వాపోయాడు. స్థానిక మీడియా ఒత్తిడితో తాము ఎస్సైని, మరో కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశామని మొరాదాబాద్ పోలీసులుతెలిపారు. విధి నిర్వహణలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలిందన్నారు.