ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమిత్ రతన్ అరెస్టయ్యారు. లంచం తీసుకున్న కేసులో ఆయన్ని బటిండా విజిలెన్స్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. హర్యానాలోని కర్నాల్‌లో ఆయన్ని విజిలెన్స్ అధికారులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విజిలెన్స్ బ్యూరో ప్రకటన చేయాల్సి వుంది.
ఈ కేసులో ఈ నెల 16న రూ. 4లక్షలు లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యే అమిత్ రతన్ పీఏని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే కేసులో తాజాగా ఎమ్మెల్యేను కూడా కర్నాల్‌లో అధికారులు అరెస్టు చేసినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఎమ్మెల్యే అమిత్ రతన్‌పై గతంలోనూ పలు మార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ని శిరోమణి అకాళీదళ్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి ఎమ్మెల్యే భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ని అరెస్టు చేసినట్టు సమాచారం.
మరోవైపు ఆప్ పై శిరోమణి అకాళీదళ్ నేత దల్జీత్ చీమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అమిత్ రతన్ ను కాపాడేందుకు ఆ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కానీ ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేశారని అన్నారు.