పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. తన ప్రభుత్వాన్నిఅస్థిరపరిచేందుకు బీజేపీ యత్నిస్తోందని, ఆ పార్టీకి కాంగ్రెస్ కూడా సహకరిస్తోందని ఆరోపిస్తున్న మాన్.. సభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని ఇదివరకే ప్రకటించారు. ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్ వాన్ రెండు గంటలు కేటాయించారు. ఇందులో ఆప్ ఎమ్మెల్యేలకు గంటా 34 నిముషాలు, కాంగ్రెస్ సభ్యులకు 19 నిముషాలు, శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేలకు మూడు నిముషాలు, బీజేపీకి 2, బీఎస్పీకి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఒక్కో నిముషం చొప్పున కేటాయించారు.
అయితే చర్చ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు సభ నుంచి వాకౌట్ చేశారు. జీరో అవర్ లో కొన్ని సమస్యలను లేవనెత్తేందుకు తమకు స్పీకర్ సమయం కేటాయించలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
93 మంది ఎమ్మెల్యేలు మాన్ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఓటు చేశారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సభ్యులంతా చేతులెత్తి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం విశేషం. గత నెల 27 నే సీఎం మాన్ విశ్వాస తీర్మానాన్ని సభ ముందుంచారు.
తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్ ఇవ్వజూపిందని మాన్ లోగడ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను బీజేపీ ఖండించింది. ఆప్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రతిపాదిస్తోందని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించింది. ప్రధాన సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ ఎత్తుగడ అని విమర్శించింది.