పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను గురువారం సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాములను కూడా పరిశీలించారు.
అనంతరం పంజాబ్ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి ప్రాజెక్టులను త్వరలోనే పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని తెలిపారు. అద్భుతమైన నిర్మాణంతో పంట పొలాలకు నీటిని అందించేలా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ నిర్మాణాలు బాగున్నాయన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మోడల్స్ ను పంజాబ్ లో కూడా అమలు చేస్తామన్నారు.
తెలంగాణలో కాలువల ద్వారా నీటిని మళ్లించి పంటలు పండిస్తున్నారని.. కానీ పంజాబ్ లో మాత్రం ఇలా ఉండవన్నారు. మా రాష్ట్రంలో బావులు, బోర్లతోనే పంటలు పండుతాయని చెప్పారు. కాలువల ద్వారా పంటలు పండించే విధానాన్ని కూడా పంజాబ్ లో తీసుకొస్తామన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు.
పంజాబ్ లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయన్నారు. చాలా చోట్ల నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి సీజన్ లో అన్నదాతల సమస్యలు మరిత తీవ్రమవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో తక్కువ కాలంలోనే మంచి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమాలను తక్షణమే పంజాబ్ లో అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.