పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ భద్రతా వైఫల్యం ఎంతటి వివాదం అయ్యిందో చూశాం. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసిందని బీజేపీ నేతలు అంటుంటే.. మోడీనే రూల్స్ పాటించలేదు.. ఆయన సభకు జనం రాలేదని కౌంటర్ ఎటాక్ చేస్తున్నాయి.
మోడీకి భద్రత కల్పించడంపై చన్నీ విఫలమయ్యారని విమర్శలు పెరిగాయి. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఆయన పెదవి విప్పారు. ప్రధాని మోడీ క్షేమంగా ఉండాలంటూ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. పైగా తన మాటలను ఒక దోహా రూపంలో కవితాత్మకంగా వినిపించారు. ‘‘తుమ్ సలామత్ రహో.. ఖయామత్ తక్, ఔర్ ఖుదా కరే ఖయామత్ న హో’’ అంటే..‘‘ప్రళయం వచ్చేదాకా మీరు క్షేమంగా ఉండాలి, కానీ.. ఆ దేవుడి దయ వల్ల ప్రళయం ఎప్పటికీ రాకూడదు’’ ఇదే చన్నీ కవితా సారాంశం.
ఈనెల 5న ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్ లో రోడ్డుపై వెళ్తుండగా.. కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఆ వెంటనే పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఎయిర్ పోర్టులో మీ సీఎంకు థాంక్యూ.. బతికి రాగలిగాను అంటూ అధికారులతో అన్నారు మోడీ.
ప్రధాని భద్రతా వైఫల్యంపై సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పలు రకాలుగా స్పందించారు. పంజాబ్ సర్కార్ ను చాలామంది టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం చన్నీ కవితాత్మక సందేశం ఇచ్చారు.