పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై శనివారం పోలీసు కేసు నమోదయ్యింది. సీఎం మద్యం మత్తులో గురుద్వారాలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పోలీసులకు బీజేపీ నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బగ్గా నేరుగా పంజాబ్ డీజీపీని ట్విట్టర్ ద్వారా కోరారు. భగవంత్ మాన్‌పై తాను పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతులను షేర్ చేశారు. ‘‘మద్యం మత్తులో గురుద్వారా దామ్దమా సాహెబ్ లోకి సీఎం భగవంత్ మాన్ ప్రవేశించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాను.. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని పంజాబ్ డీజీపీ, పోలీసులను కోరుతున్నాను’’ అని తేజిందర్ పాల్ బగ్గా ట్విట్ చేశారు.
కాగా.. ఏప్రిల్ 14న పంజాబీలకు ఎంతో ముఖ్యమైన బైశాఖి పండుగ సందర్భంగా తాగిన మత్తు ఇంకా దిగకుండానే సీఎం భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ శుక్రవారం సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది.
తాజాగా అదే విషయంలో సీఎం మాన్ పై కేసు నమోదు చేయాలంటూ బగ్గా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గతవారం విదేశీయులు కూడా ఉద్యోగాల కోసం పంజాబ్ కు రావొచ్చని.. ఉపాధి పొందొచ్చని భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గత శనివారం బటిండాలోని మహారాజా రంజిత్ సింగ్ సాంకేతిక యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న మాన్.. పంజాబ్ నుంచి మేధో వలసల ను నివారించాలని అన్నారు.
ఈ సమయంలోనే విదేశీయులకు కూడా ఉపాధి కోసం పంజాబ్ రావొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మండిపడింది. పంజాబ్‌కు విదేశీయులను ఆహ్వానించడానికి ముందు రాష్ట్రంలో సమస్యలపై దృష్టి సారించాలని చురకలంటించింది.