పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ రేపు మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సోమవారం ఐదు గంటల వరకు సీఎంకు గవర్నర్ కార్యాలయం సమయం ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన మంత్రులు వీరేనంటూ పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో నూతన మంత్రి వర్గం గురించి ప్రధానంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నూతన మంత్రుల జాబితాను ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం.
కేజ్రీవాల్ తో సమావేశం అనంతరం భగవంత్ సింగ్ మాన్ మీడియాతో మాట్లాడారు. నూతన మంత్రి వర్గం విషయాన్ని ఆయన తోసి పుచ్చారు. భేటీ సమయంలో నూతన మంత్రి వర్గం గురించి చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. నూతన మంత్రి వర్గం విషయాన్ని రాష్ట్రంలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.
వారి సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత మరోమారు నూతన మంత్రి వర్గం వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గం కూర్పుపై చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం… నూతనంగా ఐదు నుంచి ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారు. వారిలో ఒక మహిళా మంత్రి కూడా ఉండనున్నారు.