పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. పంజాబ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలకు హాజరైన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు అధికారికంగా ప్రకటించారు.
పంజాబ్ లో కరోనా బారిన పడిన ప్రజా ప్రతినిధుల సంఖ్య భారీగా ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కరోనా సోకిన ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారు శాసనసభ సమావేశానికి హాజరు కావొద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
శాసనసభ సజావుగా నిర్వహించడానికి, కరోనా ఇబ్బందులతో ఆపకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల హాస్టల్స్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 48గంట్లలో నెగెటివ్ వచ్చిన ఎమ్మెల్యేలను మాత్రమే సభకు అనుమతించాలని స్పీకర్ ను కోరారు.