తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభమైంది. పంజాబ్ సీఎం భవవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత రాజాలకు స్కీం గురించి వివరించడం జరిగింది. కంటి పరీక్ష చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపారు.
అంతకు ముందు ఖమ్మం కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కలెక్టరేట్ భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిల్డింగ్ రిబ్బన్ కట్ చేశారు. కలెక్టర్ గౌతమ్ ను సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. తరువాత అతిథులుగా వచ్చిన నేతలందరికీ కలెక్టర్ కార్యాలయాన్ని చూపించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
తరువాత కలెక్టరేట్ లోనే కేసీఆర్ తో పాటు జాతీయ నేతలందరూ విందు భోజనం చేస్తారు. ఈ విందు కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు అయిన తరువాత నేరుగా ఖమ్మం బహిరంగ సభాస్థలికి వీరందరూ చేరుకుంటారు. తరువాత సభ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగుతుంది. వేదికపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణులే ఉంటారు. అతిథుల కోసం ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది.