పంజాబ్‌లోని భద్రతా దళాలు ఓ డ్రోన్‌ను కూల్చివేశాయి. అమృత్ సర్ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో భారీ శబ్దం వినిపించింది. దీంతో అమృత్ సర్ పోలీసులతో కూడిన జాయింట్ పెట్రోలింగ్ పార్టీ లపోకే ప్రాంతంలో వెతికింది. ఆరు రెక్కలు కలిగిన డ్రోన్ ఒకటి పెట్రోలింగ్ పార్టీకి కనిపించింది.
వెంటనే పెట్రోలింగ్ పార్టీ డ్రోన్ పై కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్ కూలిపోయింది. గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ఐదు కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాల రాకను గమనించి ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు.
కానీ భద్రతా దళాలు వారిని వెంటాడి పట్టుకున్నాయి. డ్రోన్ పరికరాలు అమెరికా, చైనాలో తయారైనవిగా గుర్తించినట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు. ఆయా దేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని వాటితో డ్రోన్ ను తయారు చేసినట్టు డీజీపీ వెల్లడించారు.
ఈ నెల 19న కూడా డ్రోన్ ను భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. రాజస్థాన్‌లోని భారత్-పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 6 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.