పంజాబ్ లో వైద్యాధికారులతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ జౌరామాజ్రా దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీకి తనిఖీల కోసం మంత్రి చేతన్ సింగ్ వెళ్లారు. అక్కడ ఉన్న బెడ్లను, వైద్య సదుపాయాలను పరిశీలించిన ఆయన అధికారులతో దురుసుగా ప్రవర్తించారు.
బెడ్లు పాడైవుండటంతో వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రాజ్ బహదూర్ పై మంత్రి తీవ్రంగా ఫైర్ అయ్యారు. బెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వాటిపై పేషెంట్లు ఎలా పడుకుంటారని వీసీని మంత్రి నిలదీశారు.
నాసిరకం బెడ్ పై పడుకోవాలంటూ వీసీని మంత్రి ఆదేశించారు. మంత్రి తీరుకు భయపడిన వీసీ ఓ బెడ్‌పై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మంత్రి ప్రవర్తించిన తీరుపై విపక్షాలు, వైద్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆప్ పార్టీ చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన వైద్య సిబ్బందిని మానసికంగా నిర్వీర్యం చేస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.